ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొన్న ఆయనకు, ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇబ్బందులు తెచ్చింది. శనివారం రోజున సీబీఐ అధికారులు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మరియు దాని ప్రమోటర్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.
సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఎస్బీఐ) రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించిన రుణ మోసం కేసులో ఈ సోదాలు చేపట్టారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి.
ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, జూన్ 13న ఎస్బీఐ ఆర్‌కామ్ మరియు అనిల్ అంబానీ ఖాతాలను అధికారికంగా ‘ఫ్రాడ్’గా గుర్తించింది. రుణాలను దుర్వినియోగం చేసి, నిధులను పలు గ్రూప్ కంపెనీలకు మళ్లించారని ఎస్బీఐ ఆరోపించింది. తమ షోకాజ్ నోటీసులకు ఆర్‌కామ్ ఇచ్చిన సమాధానాలు అసంతృప్తికరంగా ఉన్నాయని కూడా బ్యాంకు వెల్లడించింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఒక ఖాతాను ఫ్రాడ్‌గా గుర్తించిన 21 రోజుల్లోపు సంబంధిత దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. దానిని అనుసరించి సీబీఐ విచారణ మొదలుపెట్టింది.
ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితమే ఈడీ అధికారులు అనిల్ అంబానీని తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. రూ. 17,000 కోట్ల రుణ మోసం కేసులో మనీలాండరింగ్ కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. ఈ విచారణలో తన ప్రమేయం ఏమీ లేదని, అన్ని ఆర్థిక నిర్ణయాలు కంపెనీ బోర్డే తీసుకుందని, తాను కేవలం సంతకాలు మాత్రమే చేశానని అంబానీ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈడీ దాడుల్లో కీలక పత్రాలు, హార్డ్‌డ్రైవ్‌లు స్వాధీనం కాగా, ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగడంతో అనిల్ అంబానీ చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుసుకున్నట్లు కనిపిస్తోంది.
Read More : దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
