ఎమ్మెల్సీ పదవి కేటాయింపుపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. కాకినాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, పదవి రానంత మాత్రాన బాధపడబోనని స్పష్టం చేశారు. గత 23 ఏళ్లుగా సీఎం చంద్రబాబుతో తన రాజకీయ ప్రయాణం కొనసాగుతోందని, తనకు న్యాయం చేయాలని చంద్రబాబు ఎప్పుడైనా ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సమీకరణాల కారణంగా ఈసారి పదవి లభించకపోయి ఉండవచ్చని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ పదవిపై నిరాశ:
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఆశించిన పలువురు నేతలకు ఈసారి నిరాశ ఎదురైంది. టీడీపీ అధిష్ఠానం కేవలం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను మాత్రమే కేటాయించగా, టీడీపీ మూడు, జనసేన, బీజేపీకి ఒక్కో స్థానం ఇచ్చింది. ఈ క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మాజీ మంత్రి కెఎస్ జవహర్ వంటి నేతలకు ఎమ్మెల్సీ పదవి ఆశలు అడియాశలయ్యాయి.
టీడీపీ హామీ – భవిష్యత్తులో అవకాశాలు:
రాష్ట్రంలో 2027 నాటికి అధిక ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతాయని, అప్పటికి పార్టీ తగిన స్ధానం కల్పిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పలువురు నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఇద్దరు నేతలకు ఆయన స్వయంగా ఫోన్ చేసి పరిస్థితిని వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.
యనమలకు కీలక పదవి:
ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పదవి ఈ నెల 29తో ముగియనుంది. ఈసారి ఆయన్ను ఎమ్మెల్సీగా కొనసాగించలేదని సమాచారం. అయితే, ఆయనకు త్వరలోనే రాజ్యసభ సభ్యత్వం లేదా గవర్నర్ పదవి లభించవచ్చనే ప్రచారం ఊపందుకుంది. తునిలోని తన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు పెంచడంతో ఈ వార్తలకు మరింత బలమొస్తోంది.

2 thoughts on “ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు – చంద్రబాబుపై ఆశాభావం”
Comments are closed.