రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించిన పేర్ని నాని.

రాజమండ్రి సెంట్రల్ జైలులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మంగళవారం ములాఖాత్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు ముఖ్య అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని, మిథున్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని, ఆయనను పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు. మిథున్ రెడ్డి అరెస్టై 40 రోజులు అయినప్పటికీ ఒక్కరోజు కూడా కస్టడీకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని బలహీనపర్చడానికే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో సహా ముద్దాయిలు చెప్పిన ప్రకారమే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు.

జైల్లో ఉన్నా మిథున్ రెడ్డి వెనుకడగ వేయరని, బయటకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి గట్టి సమాధానం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై ఆయన తిరుగుబాటు చేస్తారని పేర్ని నాని స్పష్టం చేశారు.

ఇక మరోవైపు, ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మిథున్ రెడ్డి జైలు సౌకర్యాలపై దాఖలైన రివ్యూ పిటిషన్‌తో పాటు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Read More : పులివెందులలో జగన్ వీఐపీ పాసుల వివాదం – Minister