మేరఠ్‌లో వైద్యుడి నిర్లక్ష్యం ప్రాణం బలిగొన్న ఘటన!

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఘోర నిర్లక్ష్యం ప్రాణాన్ని బలిగొంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించిన సునీల్ కుమార్ (35) అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడు. సమయానికి వైద్యం అందక స్ట్రెచర్‌పైనే కన్నుమూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడ్డ సునీల్ కుమార్‌ను బంధువులు లాలా లజపతిరాయ్ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి (ఎల్ఎల్ఆర్ఎం) ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయితే అక్కడ విధుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్ ఏసీ రూమ్‌లో కుర్చీలోనే నిద్రిస్తుండటం బయటపడింది. భుజాన చంటిబిడ్డతో భార్య ఎంతగా ప్రాధేయపడినా డాక్టర్ నిద్రలేచి చికిత్స చేయకపోవడంతో సునీల్ కుమార్ గంటల తరబడి రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాధితుడి భార్య ప్రాధేయపడుతుండగా వైద్యుడు నిర్లక్ష్యంగా నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో ఎల్ఎల్ఆర్ఎం మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్‌ను సస్పెండ్ చేస్తూ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని పట్టించుకోకుండా వైద్యుడు నిద్రించడం అత్యంత బాధాకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య విభాగం కూడా నివేదిక కోరినట్లు సమాచారం.

Read More : ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

One thought on “మేరఠ్‌లో వైద్యుడి నిర్లక్ష్యం ప్రాణం బలిగొన్న ఘటన!

Comments are closed.