మా బిడ్డ తిరిగి వచ్చాడు – చిరంజీవి ట్వీట్‌తో అభిమానులకు ఊరట

Mark Shankar accident update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లోని సమ్మర్ క్యాంప్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఏడేళ్ల ఈ పసిబిడ్డకు జరిగిన ఈ సంఘటన టాలీవుడ్ లోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. జనసేన కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో విస్తృతంగా చర్చకు వచ్చింది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా శుభవార్తను పంచుకున్నారు. “మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ స్వామి కృపతో ఈ పసిబిడ్డకు పునర్జన్మ లభించింది,” అంటూ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌తో పాటు చిరంజీవి, పవన్ కలిసి ఉన్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తన సాధారణ రూపంలో తిరిగి కనిపించడం అభిమానులకు ఊరట కలిగిస్తోంది.

ఈ సంఘటన కారణంగా పవన్ కళ్యాణ్ తన తాజా సినిమా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ వాయిదా వేశారు. వాస్తవానికి ఈ వారంలోనే షూటింగ్ పూర్తి చేసి, డబ్బింగ్ ముగించాలని ప్లాన్ చేసిన పవన్, ప్రమాద ఘటన తర్వాత షూటింగ్‌కు విరామం ఇచ్చారు. మే 9న సినిమా విడుదలకు సంబంధించిన సందేహాలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొని, తదుపరి అప్‌డేట్స్ అందిస్తారని చిత్రబృందం వెల్లడించింది.

Read More

One thought on “మా బిడ్డ తిరిగి వచ్చాడు – చిరంజీవి ట్వీట్‌తో అభిమానులకు ఊరట

Comments are closed.