మెదక్ జిల్లాలో రికార్డు వర్షం – BJP

మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30.1 సెం.మీ కుండపోత వర్షపాతం నమోదైంది. నాగపూర్‌లో 27 సెం.మీ, చేగుంటలో 22 సెం.మీ, రామాయంపేట మండలంలో 20 సెం.మీ వర్షం నమోదైంది. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన ఈ భారీ వర్షంతో రామాయంపేటలో పలు కాలనీలు జలమయమైపోయాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మెదక్ నుంచి బోధన్, బాన్స్‌వాడ వైపు బస్సు సర్వీసులు నిలిపివేయబడ్డాయి.

ఈ నేపథ్యంలో రామాయంపేట వరద ప్రభావిత ప్రాంతాలను ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. సిద్దిపేట–రామాయంపేట 765 డీజీ జాతీయ రహదారిపై నందిగామ వద్ద కల్వర్టు కుంగిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయని ఆయన తెలిపారు. కొత్త బ్రిడ్జి నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఇప్పటికే చర్చించానని చెప్పారు. వరద తగ్గిన వెంటనే రహదారి రాకపోకలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీబీపేట్ వద్ద రెండు చోట్ల జాతీయ రహదారి కొట్టుకుపోయిందని వివరించారు.

గత 20 ఏళ్లలో ఇలాంటి వర్షం చూడలేదని రఘునందన్ రావు పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More : హైదరాబాద్‌లో సీఎం రూపంలోని గణనాథుడి విగ్రహంపై వివాదం

One thought on “మెదక్ జిల్లాలో రికార్డు వర్షం – BJP

Comments are closed.