అటవీ శాఖ అధికారులు కాశినాయన ఆశ్రమానికి చెందిన అన్నదాన సత్రాలను కూల్చివేయడంపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సత్రాల కూల్చివేతను తప్పుబట్టిన లోకేశ్, ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక, సొంత నిధులతో ఆ సత్రాలను తిరిగి నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గతంలో తిరుపతిలో టీటీడీ టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రభుత్వం తరఫున క్షమాపణ కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేశ్ కూడా అదే తీరులో క్షమాపణ కోరడం, ఇది పవన్ కళ్యాణ్‌కు ‘టిట్ ఫర్ టాట్’ చర్యగా కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అప్పట్లో టీటీడీ చైర్మన్ రేసులో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరును పరిశీలించినా, లోకేశ్ ప్రోత్సాహంతో బీఆర్ నాయుడు చైర్మన్‌గా ఎంపికయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజాగా కాశినాయన సత్రాల కూల్చివేతను రాజకీయంగా ఉపయోగించుకుని లోకేశ్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఇదే ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

One thought on “కాశినాయన అన్నదాన సత్రాల కూల్చివేతపై మంత్రి లోకేశ్ ట్వీట్.. రాజకీయ వర్గాల్లో చర్చ”
Comments are closed.