ఫార్ములా-ఈ కేసులో తనకు ఏసీబీ నోటీసులు అందాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే ఇద్దరం కలిసి లై డిటెక్టర్ పరీక్షకు హాజరవుదామని సవాల్ విసిరారు. ప్రభుత్వం నడపడం చేతకాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కస్‌లు చేస్తోందని ఆరోపించారు.
ఈ కేసులో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ ఆదేశించిందని కేటీఆర్ చెప్పారు. రూ.44 కోట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు బదిలీ అయినట్లు విచారణలో పేర్కొనబడిందని, అయితే ఆ మొత్తం ఫార్ములా-ఈ సంస్థ ఖాతాలోనే సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను ఏసీబీ అధికారులకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ పరోక్షంగా ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. “పదేళ్ల క్రితం నల్ల సంచి డబ్బులతో దొరికిన వ్యక్తి ఎవరో గుర్తు చేయగలరా?” అంటూ చురకలేస్తూ వ్యాఖ్యానించారు. “మనిద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం కాబట్టి న్యాయమూర్తి సమక్షంలో లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందాం. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేద్దాం. ప్రజలే తీర్పు చెప్పాలి. ఈ ధైర్యం మీకుందా?” అని సవాల్ విసిరారు.
ప్రభుత్వం ప్రజా ధనాన్ని అనవసరంగా వృధా చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు… ఫార్ములా ఈ లాంటి అంతర్జాతీయ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నిధులన్నీ ఖాతాలో ఉన్నప్పుడు దర్యాప్తు పేరుతో అనవసర తొందరపాటు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
Read More : 90 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

2 thoughts on “రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ సవాల్”
Comments are closed.