వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ

అమరావతి ప్రాంత మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్ట్, ‘సాక్షి టీవీ’ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను హైదరాబాద్‌లోని జర్నలిస్ట్స్ కాలనీలో అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యల కోసం గుంటూరుకు తరలించారు.

ఈ ఉదయం ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి (జీజీహెచ్) తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు పూర్తైన తరువాత మంగళగిరి కోర్టులో హాజరు పరచనున్నారు.

అమరావతిని “వేశ్యల రాజధాని”గా అభివర్ణించిన జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యల్ని ప్రసారం చేసిన కేఎస్ఆర్ లైవ్‌ షోలో యాంకర్‌గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు, వాటిని ఖండించకపోవడమే కాకుండా కొనసాగించేందుకు మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేసిన మహిళలను అవమానించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనపై మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు కృష్ణంరాజు, ‘సాక్షి టీవీ’ యాజమాన్యం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంతోపాటు సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఈ అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. మౌలిక విలువలకు విరుద్ధంగా మౌఖిక దాడులు, మహిళలపై అసభ్య వ్యాఖ్యలపై చట్టం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Read More : హైదరాబాద్, అన్నమయ్య జిల్లాల్లో ఆత్మహత్యలు

One thought on “వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ

Comments are closed.