తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
“బాలకృష్ణ రోజుకొకరినీ కొడతారంట కదా. ఆయన సినిమాలు ఎవరు చూస్తారు? అయినా కలెక్షన్లు వస్తాయట,” అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారగా, అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కోమటిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్‌పై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు
అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తీరుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బీఆర్ఎస్ వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెల్వదు. వాళ్లు మాటలతోనే బతకడం అలవాటుచేసుకున్నారు,” అంటూ ఆయన విమర్శించారు. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ “తండ్రి చాటు కొడుకు,” హరీష్ రావును ఉద్దేశించి “మామ చాటు అల్లుడు” అని వ్యాఖ్యానించారు. వీరికి కనీసం డిప్యూటీ లీడర్ హోదా కూడా లేదని, అలాంటి వారి మాటలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ సభ్యుల నిరసన – అసెంబ్లీ నుంచి వాకౌట్
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జాప్యం అంశంపై జరిగిన చర్చలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాగాలు, పూజలకే ప్రాధాన్యత ఇచ్చారని, కానీ రోడ్ల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్
కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు. కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని, అసెంబ్లీలో అబద్ధాలు ప్రచారం చేయడం ఆపాలని కోరారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం తగదని హరీష్ రావు నేతృత్వంలోని బృందం స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది.
కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర చర్చకు దారి తీయగా, దీనిపై అధికార పార్టీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన వస్తుందో వేచిచూడాలి.
Read More : మంత్రి సీతక్క: బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, కౌషిక్ రెడ్డికి కౌంటర్
