పిల్లల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఓ దంపతికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్త ఆశను ఇచ్చింది. 18 ఏళ్లుగా ఎన్నో ఐవీఎఫ్ చికిత్సలు తీసుకున్నా ఫలితం లభించని దంపతికి, సరికొత్త ఏఐ టెక్నాలజీ ద్వారా శిశువు ఆశిర్వాదంగా వచ్చింది. వైద్య నిపుణులు దీన్ని “అద్భుత విజయంగా” పేర్కొంటున్నారు. భర్త అరుదైన అజూస్పెర్మియా సమస్యతో బాధపడుతుండటంతో వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ సమస్య వల్ల వీర్యంలో శుక్రకణాలు కనిపించవు. చివరికి, న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించిన వారు, అక్కడ అభివృద్ధి చేసిన ‘స్టార్’ (Sperm Tracking and Recovery) అనే ఏఐ ఆధారిత విధానాన్ని ఉపయోగించారు.
ఈ విధానంలో, ప్రత్యేకమైన చిప్‌పై వీర్యాన్ని ఉంచి మైక్రోస్కోప్ ద్వారా గంటలోనే 80 లక్షల ఫోటోలు తీసి, వాటిలో దాగి ఉన్న శుక్రకణాలను ఏఐ గుర్తిస్తుంది. సాధారణ వైద్యులు రెండు రోజులు గడిపినా కనిపించని శుక్రకణాలను, ఈ ఏఐ పద్ధతిలో గంటలోనే గుర్తించగలిగారు. ఈ పద్ధతితో ఐవీఎఫ్ చేసిన వైద్యులు విజయవంతంగా శుక్రకణాలను గుర్తించి, గర్భధారణ సాధించారు. ఇది ప్రపంచంలోనే తొలి విజయవంతమైన గర్భధారణగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ, “ఇది నిజమేనా అనిపిస్తూ ఉంది. స్కాన్ చూసేంతవరకూ నమ్మలేకపోయా” అని హర్షం వ్యక్తం చేశారు.
ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ, “ఈ టెక్నాలజీ వల్ల శుక్రకణాల కొరత ఉన్న వేలాది మందికి ఆశ లభిస్తుంది” అని వెల్లడించారు. ఇది వైద్య రంగంలో కొత్త దిశగా అడుగు పెట్టినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More : దేశవ్యాప్తంగా యూపీఐ అమలుకు తపాలా శాఖ సన్నాహాలు

One thought on “AI టెక్నాలజీతో సంతాన సాఫల్యం”
Comments are closed.