పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెన్సేషనల్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, పవన్ కల్యాణ్‌ను “సీరియస్ పొలిటిషియన్ కారు” అంటూ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తూ ఆయన ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారని వ్యాఖ్యానించిన ఆమె, పవన్ కల్యాణ్ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని వైసీపీతో మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారని విమర్శించారు.

హిందీ నేర్చుకోవాలని పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ — ‘‘ఇలాంటి వ్యక్తి వ్యాఖ్యలను ప్రజలు అంతగా పట్టించుకోక్కర్లేదు,’’ అని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రారంభంలో వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న పవన్, ఇప్పుడు బీజేపీతో కలిసి హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారని విమర్శించిన కవిత — ‘‘చెగువేరాను ఆదర్శంగా చెప్పిన ఆయన, సీపీఐ, సీపీఎంతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు హిందుత్వ భావజాలం వైపు మొగ్గు చూపుతూ, బీజేపీకి అతిభక్తిగా మారిపోయారు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘పవన్ చెప్పే మాటల్లో ఎటువంటి స్థిరత్వం ఉండదు. రేపు తమిళనాడుకెళ్లి హిందీని తేగనంటూ ప్రకటనలు చేస్తే ఆశ్చర్యపడాల్సిన పని లేదు,’’ అంటూ తన సెటైర్‌ను కొనసాగించారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చనీయాంశంగా మారాయి.

Read More : హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ, HCU భూములపై పరిశీలన