విశిష్టంగా రూపొందుతున్న ‘కన్నప్ప’ సినిమా కష్టాల్లో.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ విడుదలకు ముందే సమస్యల్లో చిక్కుకుంది.సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఉన్న హార్డ్ డ్రైవ్‌ను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్‌నగర్‌లో తీవ్ర కలకలం రేగింది.

పోలీసుల కథనం ప్రకారం… కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్, ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా కీలక కంటెంట్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ నుంచి కొరియర్‌ ద్వారా విజయ్‌కుమార్‌ ఫిలింనగర్‌లోని కార్యాలయానికి పంపించారు. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్‌ను ఆఫీస్ బాయ్ రఘు స్వీకరించాడు.

అయితే, ఆ హార్డ్‌డ్రైవ్‌ను రఘు ఎవరికీ తెలియకుండా చరిత అనే మహిళకు అప్పగించినట్లు సమాచారం. అప్పటి నుంచి రఘు, చరిత ఇద్దరూ పరారీలో ఉన్నారు.

ఈ ఘటనపై స్పందించిన విజయ్ కుమార్… “ఈ చర్య వెనుక దురుద్దేశమే ఉందని అనుమానిస్తున్నాం. మా సినిమా ప్రాజెక్టును ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగింది” అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హార్డ్‌డ్రైవ్ అపహరణ వెనుక ఉన్న కారణాలు, వ్యక్తులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలతో కూడిన విచారణను కొనసాగిస్తున్నారు.

‘కన్నప్ప’ వంటి పెద్ద సినిమాకు ఇలాంటి పరిణామాలు తలెత్తడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Read More : కేతిక శర్మకు రవితేజ సినిమా ఛాన్స్

One thought on “విశిష్టంగా రూపొందుతున్న ‘కన్నప్ప’ సినిమా కష్టాల్లో.

Comments are closed.