ఆంధ్రప్రదేశ్‌కి సినీ పరిశ్రమ తరలిరావాల్సిన అవసరం ఉందని పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త చలనచిత్ర విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్టే ఏపీలోనూ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ సదుపాయాల కోసం రాయితీలతో కూడిన స్థలాలను కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
విజయవాడలో వెస్ట్రన్ లవ్ చిత్రానికి క్లాప్ కొట్టిన తర్వాత మాట్లాడిన మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రంగ అభివృద్ధిపై పూర్తి నిబద్ధతతో ఉన్నారని చెప్పారు. ఏపీలోని పలు ప్రాంతాలు సినిమాల షూటింగ్‌కి అనువుగా ఉన్నా, అవసరమైన మౌలిక సదుపాయాల కొరత ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చిత్రీకరణలు జరుగుతున్నా, స్థిరమైన మౌలిక వనరుల కొరత వల్ల పరిశ్రమ అభివృద్ధి కాలేకపోతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న స్టూడియోలు నిరుపయోగంగా మారిన విషయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. అందుకే, కొత్త విధానంతో పరిశ్రమను ఏపీలో బలంగా స్థాపించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఈ రంగం ఎకానమీకి మంచి సహకారాన్ని అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సినీపరిశ్రమ ఏపీలోకి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చినా, ఇది కేవలం రాజకీయ ప్రకటనగా మిగిలిపోకుండా, వాస్తవ చర్యల్లోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

2 thoughts on “హైదరాబాద్ నుంచి ఏపీకి సినీ పరిశ్రమ తరలింపు అవసరం: మంత్రి కందుల దుర్గేష్”
Comments are closed.