కడపలో అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు ప్రారంభం.

తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు ఈరోజు నుంచి వైభవంగా ప్రారంభమైంది. ఈసారి మహానాడు కడపలో నిర్వహించబడుతున్న సందర్భంగా నగరం అంతా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పండుగలా మారిపోయింది. 2024 ఎన్నికల విజయానంతరం జరుగుతున్న తొలి మహానాడుగా ఇది ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

కడప శివారు చెర్లోపల్లిలో మహానాడు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ, చివరిదినం బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్)లో ఆసక్తికరంగా స్పందించారు. స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన ముహూర్త బలం ఎంతో శక్తివంతమైందని వ్యాఖ్యానించారు.

“విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు టీడీపీని స్థాపించిన శుభ ముహూర్తం గొప్పదైంది. కార్యకర్తలే మా బలం, బలగం. ఎన్ని కష్టాలు వచ్చినా పసుపు జెండాను ఎత్తిపట్టి నిలబడి పోరాడే కార్యకర్తలే నాకు స్పూర్తి. ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యే పసుపు పండుగ మహానాడుకు అందరికీ హార్దిక స్వాగతం” అని లోకేశ్ పేర్కొన్నారు.

Read More : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.