దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు గట్టిగా రంగంలోకి దిగాయి.
గత వారం జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌తో వరుసగా చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ ద్వారా జరిగిన సంభాషణల్లో కీలకమైన సమాచారం వెలుగు చూసింది.
దర్యాప్తులో భాగంగా జ్యోతి మల్హోత్రా అలీ హసన్‌కు భావోద్వేగంగా “నన్ను పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకో” అంటూ మెసేజ్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా, భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం కూడా ఆమె పంచినట్లు తెలుస్తోంది. వీరి మధ్య సంభాషణల్లో గూఢార్థాలతో కూడిన కోడ్ భాష కూడా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
జ్యోతికి సంబంధించి ఉన్న నాలుగు బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వీటిలో ఒక ఖాతాలో దుబాయ్ నుంచి వచ్చిన డబ్బుల లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? ఎందుకు పంపారు? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో దేశ భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమైంది. జ్యోతి మల్హోత్రా అరెస్టు తరువాత పలు రాష్ట్రాల్లో గూఢచర్య ఆరోపణలతో మరో పది మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో చాలామంది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగు చూడనున్నాయి.
Read More : సూట్‌కేసులో 10 ఏళ్ల బాలిక మృతదేహం, స్థానికుల్లో కలకలం.

One thought on “జ్యోతి మల్హోత్రా దర్యాప్తు వేగంగా ముందుకు”
Comments are closed.