గుజరాత్‌ సరిహద్దులో ఉద్రిక్తత

గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంతా జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర హెచ్చరికగా భావిస్తున్న ఈ ఘటనలో ఓ పాకిస్థాన్ జాతీయుడు భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నించగా, బీఎస్‌ఎఫ్ (BSF) జవాన్లు కాల్చి హతమార్చారు.

బీఎస్‌ఎఫ్ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆ వ్యక్తి అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన కంచెను దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని అడ్డగించేందుకు ముందుగా హెచ్చరికలు జారీ చేశాయి. అయితే, ఆ వ్యక్తి హెచ్చరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ముందుకు దూసుకెళ్లాడు. దాంతో, ఆత్మరక్షణ చర్యలలో భాగంగా బీఎస్‌ఎఫ్ జవాన్లు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశ సరిహద్దు భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో పాటు ఇతర అన్ని సున్నిత ప్రాంతాల్లో కూడా బీఎస్‌ఎఫ్ బలగాలు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Read More : బాధితులను పరామర్శించనున్న రాహుల్ గాంధీ.

One thought on “గుజరాత్‌ సరిహద్దులో ఉద్రిక్తత

Comments are closed.