జాన్ అబ్రహాం రీమేక్ రిస్క్: సరైన నిర్ణయమా, తప్పు అడుగా?

John Abraham Ayyappanum Koshiyum Remake

బాలీవుడ్‌లో రీమేక్‌ల ప్రభావం పెద్ద సమస్యగా మారింది. అగ్ర హీరో అక్షయ్ కుమార్ వరుసగా రీమేక్ చిత్రాల్లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలను చవిచూశాడు. ఈ అనుభవాల వల్ల అక్షయ్ ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ కోసం ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. ఇదే సమయంలో, మరో టాలెంటెడ్ హీరో జాన్ అబ్రహాం కూడా రీమేక్ బాట పట్టడం విమర్శలకు తావిచ్చింది. 2020లో విడుదలైన మలయాళ బ్లాక్‌బస్టర్ “అయ్యప్పనుమ్ కోషియమ్”ను హిందీలో రీమేక్ చేయాలని జాన్ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించాలని భావిస్తున్నారు. రీమేక్ హక్కులు ఇప్పటికే జాన్ చేతిలో ఉండగా, కథను మరింత కమర్షియలైజ్ చేసి మాస్ ప్రేక్షకులకు చేరవేయాలనే ఆలోచనలో ఉన్నారు.

తెలుగులో “భీమ్లా నాయక్”గా రీమేక్ చేసిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటనతో ఆకట్టుకున్నా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. మాతృక చిత్రానికి ఉన్న మేజిక్ తెలుగు వెర్షన్‌లో కొరవడింది. బాలీవుడ్ కూడా ఇటీవల రీమేక్‌లపై మొగ్గు చూపడం తగ్గించి, ఒరిజినల్ కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో జాన్ అబ్రహాం ఈ రీమేక్‌పై రిస్క్ తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాన్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇతర హీరోలను ఎంపిక చేస్తే, తన నటుడిగా ఉన్న రిస్క్‌ను తగ్గించుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల విడుదలైన “డిప్లొమాట్” చిత్రంతో జాన్ అబ్రహాం విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ రావచ్చనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ సమయంలో రీమేక్ లాంటి రిస్కీ ప్రాజెక్ట్‌ను చేపట్టడం సరైన నిర్ణయమా అనే ప్రశ్నలే మిగిలాయి. జాన్ తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లాలంటే, ఒరిజినల్ కంటెంట్‌కే మొగ్గు చూపాలని పలువురు సూచిస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వస్తున్న నేపథ్యంలో, రీమేక్‌ల జోలికి పోకుండా విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడమే సవాల్‌గా మారింది.

Read More

One thought on “జాన్ అబ్రహాం రీమేక్ రిస్క్: సరైన నిర్ణయమా, తప్పు అడుగా?

Comments are closed.