ఉగ్ర దాడులపై పాకిస్థాన్‌కు ముందస్తు సమాచారం లేదు.

ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన దాడుల గురించి పాకిస్థాన్‌కు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఆపరేషన్ పూర్తయ్యాకే తెలియజేశామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. విదేశాంగ శాఖకు చెందిన పార్లమెంటరీ సలహా కమిటీ సమావేశంలో ఆయన ఈ అంశాన్ని స్పష్టంగా వివరించారు.

జైశంకర్ మాట్లాడుతూ, “భారత దళాలు ఉగ్ర స్థావరాలపై దాడులు విజయవంతంగా ముగించిన తర్వాత మాత్రమే, అధికారిక ప్రకటన విడుదల చేసిన అనంతరం పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ (DGMO)కు సమాచారాన్ని అందించాం” అని తెలిపారు.

దేశ ప్రయోజనాలపై రాజకీయ భేదాలు పక్కనపెట్టి, అందరూ ఒకే మాట మాట్లాడాలని ఆయన సూచించారు. విదేశీ పర్యటనలకెళ్లే పార్లమెంటరీ బృందాలు దేశ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని కోరారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, దాడులపై పాకిస్థాన్‌కు ముందుగా సమాచారం ఇచ్చినట్టు ప్రచారం చేయడం వాస్తవాలు వక్రీకరించడం మాత్రమేనని జైశంకర్ ఖండించారు. ఇస్లామాబాద్‌కు ముందస్తుగా ఎందుకు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గతంలో ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More : దేశంలో మళ్లీ కరోనా ముప్పు…