విద్యార్థులు దేశ అభివృద్ధికి దారితీయాలి

కృష్ణా జిల్లా ఉషారామ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా విద్య, సంస్కారం, జాతీయ అభివృద్ధిపై ఆయన విలువైన సూచనలు చేశారు. వికాసవంతమైన దేశాల జాబితాలో భారత్ ఇప్పటికే నాలుగో స్థానంలో ఉందని, త్వరలోనే మూడో స్థానాన్ని అధిరోహించబోతోందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. చదువు సంపాదించడం మాత్రమే కాకుండా, విజ్ఞానం, సంస్కారం కూడా విద్యార్థులు అలవర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

విద్యతోపాటు విలువలు నేర్పేలా ప్రతి విద్యాలయంలో పఠనశాల, గ్రంథాలయం, సేవా కేంద్రాలు ఉండాలని సూచించారు. విద్యార్థులు కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా ఐక్యతగా ఉండేలా చూడాలని కోరారు. “కన్నతల్లి, పుట్టిన ఊరు, పాఠాలు చెప్పిన గురువులను ఎప్పటికీ మరవకూడదు. ఎంత ఉన్నత స్థాయికి చేరినా వాటిని గుర్తు పెట్టుకోవాలి” అని దిశానిర్దేశం చేశారు.

పదవీ విరమణ చేసినా, పెదవీ విరమణ చేయలేదంటూ ఆయన హాస్యంగా వ్యాఖ్యానించారు. కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లి విద్యార్థులకు దారి చూపడమే తన లక్ష్యమన్నారు. ఉషారామ ఇంజినీరింగ్ కళాశాల 16 ఏళ్లుగా విద్యారంగంలో ఉత్తమ సేవలు అందిస్తోందని కొనియాడారు.

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి:

నేటి యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం విషయాల్లో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. “ఇంజనీర్లు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పద్ధతులు తీసుకురావాలి. మానవాళి సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనే దిశగా ముందుకు సాగాలి. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇతరులకు ఉపాధి కల్పించాలి. కేవలం ఉద్యోగం కోసం మాత్రమే ఆగిపోవద్దు” అని నాయుడు స్పష్టం చేశారు.

భాషపై స్పష్టమైన సందేశం:

తెలుగు భాషపై తన అభిమానం వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు, “మాతృభాషలోనే విద్య కొనసాగాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. గుడ్ మార్నింగ్‌లు వద్దు… నమస్కారం మన సంస్కారం. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, ఆ తర్వాత ఆంగ్ల భాష” అని వ్యాఖ్యానించారు. భారత మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హిందీలో చదివారని, తాను తెలుగులో చదివానని, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా తెలుగులో చదివి ఎదిగారని గుర్తు చేశారు.

ఆరోగ్యంపై సూచనలు:

పిజ్జాలు, బర్గర్లు తినడం ఆరోగ్యాన్ని పాడు చేస్తుందంటూ, భారత సంప్రదాయ ఆహారాన్ని పాటించాలని సూచించారు. “ఇడ్లీ, దోశ, సాంబారు, గుంటూరు కారం ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. వాటిని మరిచిపోకండి. రోజూ నడక, వ్యాయామం, యోగాను అలవాటు చేసుకోండి. యోగా మోదీ కోసం కాదు… మన ఆరోగ్య కోసం” అని వివరించారు.

అంతేకాదు, తల్లిదండ్రులను గౌరవించాలి, బామ్మతాతలతో స్నేహంగా గడపాలని సూచించారు. విద్యార్థులు తమ తెలివి, శ్రమతో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

Read More : విశాఖపట్నంలో పేకాట స్థావరంపై దాడి

One thought on “విద్యార్థులు దేశ అభివృద్ధికి దారితీయాలి

Comments are closed.