ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీ సమావేశాల తొలి రోజున సభకు హాజరై అనంతరం బహిష్కరణ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించినా, జగన్ వారి చర్యలను నిలువరించలేదు. ఈ వ్యవహారంపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతేడాది జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి రాసిన లేఖ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
సభలో స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు – హైకోర్టు విషయంలో క్లారిటీ
సభలో మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, “జగన్ 2024 జూన్ 24న నాకు లేఖ రాశారు. అందులో తప్పుడు ఆరోపణలు, బెదిరింపులు, ప్రతిపక్ష హోదా కోరుతూ అభ్యర్థనలు ఉన్నాయి. అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించి, శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యాలయాన్ని రిట్ పిటిషన్ ద్వారా ఆదేశించాలని కోరారు. కానీ, హైకోర్టు స్పీకర్‌ను ఏ విధంగానూ ఆదేశించలేదు. అయితే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది” అని ఆరోపించారు.
ప్రతిపక్ష హోదాపై నిబంధనలు – జగన్ వ్యాఖ్యలపై స్పీకర్ స్పందన
ప్రతిపక్ష హోదాకు సంబంధించి “ఒక పార్టీకి కనీసం 10% సీట్లు ఉండాలి. గతంలో కూడా 1972-77, 1994-99 కాలంలో ఈ ప్రమాణం నెరవేరని కారణంగా ప్రతిపక్ష హోదా ఎవరికి రాలేదు” అని స్పీకర్ స్పష్టత ఇచ్చారు. 2019లో చంద్రబాబును ఉద్దేశించి “ఐదుగురు ఎమ్మెల్యేలు మారితే టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉండదేమో” అని జగన్ చేసిన వ్యాఖ్యలను సభలో గుర్తు చేశారు. తాను ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నానని, జగన్ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటే దీనిపై సభ్యులే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

One thought on “ప్రతిపక్ష హోదాపై స్పష్టత”
Comments are closed.