ఇరాన్-America అణు ఒప్పందంపై షరతు

ఇరాన్, అమెరికాతో అణు ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభించేందుకు కఠిన షరతు విధించింది. భవిష్యత్తులో తమ దేశంపై అమెరికా లేదా ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు చర్చలు సాధ్యపడవని ఇరాన్ భారత్ రాయబారి ఇరాజ్ ఎలాహి తెలిపారు. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇలాంటి హామీ లేకుండా చర్చలకు ఎలాంటి అర్థం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ గతంలో “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట తమ అణు కేంద్రాలపై దాడులు జరిపిందని ఎలాహి గుర్తుచేశారు. ఆ దాడుల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, సైనిక అధికారులు, సాధారణ పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు ఉండడమే కాకుండా, దాడులు జరపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం అని ఆయన విమర్శించారు.

ఇరాన్ ఎప్పటికీ దౌత్యానికే ప్రాధాన్యం ఇస్తుందని, గాజా విషయంలో కూడా శాంతియుత దృక్పథాన్ని పాటించిందని ఎలాహి తెలిపారు. చర్చల సమయంలో దాడులు చేయడం దౌత్యద్రోహ చర్యగా పేర్కొన్నారు. ఈ తరహా చర్యలు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు.

Read More : బ్రిటన్ ఎఫ్-35బి జెట్ … రెక్కలు విడదీసి తరలింపు