కీవ్‌పై రష్యా భారీ దాడులు

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా మరోసారి తీవ్ర క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 14 మంది మృతి చెందగా, 44 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులు ప్రపంచ దేశాధినేతలు కెనడాలో జీ7 సమావేశాలకు హాజరవుతున్న సమయంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా హాజరవుతున్న సందర్భంలో ఈ దాడులు చోటుచేసుకోవడం విశేషం.

ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇగోర్ క్లెమెంకో వివరించగా, కీవ్‌లోని 27 ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయని తెలిపారు. నివాస భవనాలు, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు జరిపిందని పేర్కొన్నారు. కేవలం ఒక అపార్ట్‌మెంట్ సముదాయంలోనే 30 ఫ్లాట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. కీవ్‌తో పాటు ఒడెస్సా, చెర్నిగివ్‌లలో కూడా మరిన్ని దాడులు జరిగాయని వివరించారు.

ఈ ఉదయం కీవ్‌లోని సోలోమియాన్‌స్కీ జిల్లాలో షాహెద్ తరహా డ్రోన్ ఒక భారీ అపార్ట్‌మెంట్‌పై నేరుగా దాడికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడిలో 62 ఏళ్ల అమెరికా పౌరుడు మృతిచెందాడు. ఆయన్ని గాయపడిన వారిని చికిత్స కోసం తరలిస్తున్న సమీప భవనంలో ఉన్న సమయంలో మృతి చెందినట్టు కీవ్ మేయర్ విటాలీ క్లిచ్‌కో తెలిపారు.

రష్యా దాడుల్లో గాయపడినవారిలో ఎక్కువమంది స్వియాటోషిన్‌స్కీ, సోలోమియాన్‌స్కీ ప్రాంతాలకు చెందిన వారని అధికారులు వెల్లడించారు. మరోవైపు, వాయుసేన కూల్చివేసిన డ్రోన్ల శకలాలు పడి కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్టు సమాచారం.

ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జీ7 దేశాధినేతల సమావేశంలో ఈ అంశం ప్రధానాంశంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

One thought on “కీవ్‌పై రష్యా భారీ దాడులు

Comments are closed.