ఫెయిల్ అయ్యానన్న భయమే ప్రాణాలు తీసింది!

Inter results student suicides in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత పలుచోట్ల విషాదం నెలకొంది. ఫెయిల్ అయ్యారన్న ఆందోళనతో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చదువులంటే ఉద్యోగం సాధించే మార్గం మాత్రమే కానీ, జీవితం మొత్తం కాదు అనే నిజం మరచిపోయారు. ఫలితాల్లో నెగెటివ్‌ రావడం జీవితాన్ని ఆపేయాల్సిన కారణం కాదని తెలిసినా.. కొంతమంది ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు.

విశాఖపట్నం జిల్లాలో తగరపువలస గ్రామానికి చెందిన చరణ్ ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ధైర్యం చెప్పినా, వారు బయటకు వెళ్లిన సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.

కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలంలో వెంకట సుదీశ్వరరెడ్డి అనే విద్యార్థి ఫలితాలు రావకముందే ఫెయిల్ అయ్యానని భయపడి, ప్రాణాలు తీసుకున్నాడు. పరీక్షలు సరిగా రాయలేకపోయానన్న ఆందోళనతో గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న అతను చివరికి తల్లిదండ్రులను శోకసాగరంలో ముంచేశాడు.

విజయనగరం జిల్లాలో ముగశాల స్రవంతి కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మనోవేదనలో ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు, బాపట్ల జిల్లాలోని ప్రశాంత్ రెడ్డి కూడా ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రతి శ్వాస ఆశగా ఉండాల్సిన విద్యార్థి జీవితాలు.. ఒక ఫలితంతో ముగిసిపోవడం మనసును కలచివేస్తోంది.

Read More