రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలపై వర్షాల ఉధృతి కొనసాగుతోంది. గురువారం రోజు రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న వారం రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
అంతేకాకుండా, రాబోయే ఐదు రోజుల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం శుక్రవారం నాడు పలుస్థలాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

తెలంగాణలో వర్ష సూచన కలకలం
తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా మెరుపులు, పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సహాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రకటించారు.

Read More : జల వివాదాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు : Minister

One thought on “రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం..

Comments are closed.