భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ రాజధానిలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఒక్కరోజే 138 విమానాలు రద్దయ్యాయి. భద్రతా పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎయిర్‌పోర్టు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇదే సమయంలో పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేశాయి. దీంతో ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పాకిస్థాన్ భారత్ సరిహద్దుల్లోకి డ్రోన్లతో దాడులకు పాల్పడింది.
గురువారం రాత్రి పాకిస్థాన్ దాదాపు 300–400 టర్కీ తయారీ డ్రోన్లను ప్రయోగించినట్టు సమాచారం. అయితే భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
శుక్రవారం నాడు పాక్ జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని భారత సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. జమ్మూలోని ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా, హీరానగర్‌తో పాటు రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. అయితే భారత వైమానిక రక్షణ వ్యవస్థ, ముఖ్యంగా ఎస్-400 క్షిపణి సిస్టమ్, ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం లేవని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు, పాకిస్థాన్ దాడులకు గట్టి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి లాహోర్ పరిధిలోని సైనిక మౌలిక సదుపాయాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్టు సమాచారం. తాజా పరిణామాలపై అధికారిక స్థాయిలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read More : Update : శ్రీనగర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దోపిడీ యత్నం
One thought on “ఢిల్లీలో 138 విమానాల రద్దు, సరిహద్దుల్లో గగనతల యుద్ధం.”
Comments are closed.