భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి డాక్టర్ అలీ అక్బర్ అహ్మదియాన్‌తో సోమవారం ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. ఈ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాజెక్టులైన చాబహార్ పోర్ట్ అభివృద్ధి, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC)పై ప్రధానంగా దృష్టి సారించారు.
ఈ విషయంపై భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. చర్చల్లో ప్రాంతీయ స్థిరత్వం, వ్యూహాత్మక సహకారం మరియు వాణిజ్య మార్గాలపై దృష్టిసారించారని పేర్కొంది.
అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ఇరాన్ ఈ ప్రాంతంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నందుకు అభినందనలతో పాటు, ఇరు దేశాల మధ్య సహకారం మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. చాబహార్ పోర్ట్ అభివృద్ధికి భారత్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ప్రాజెక్ట్ ద్వారానే భారత్–మధ్య ఆసియా దేశాల మధ్య వాణిజ్యం మరింత వేగవంతం అవుతుందని అన్నారు.
INSTC ద్వారా రష్యా, ఐరోపా దేశాలకు సరుకులు త్వరగా, తక్కువ ఖర్చుతో రవాణా చేయవచ్చని వాణిజ్యవేత్తలు భావిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌తో పాటు ఇతర మధ్య ఆసియా దేశాలకూ చాబహార్ పోర్ట్ ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుందని అంచనా.
ఈ చర్చల నేపథ్యంలో, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుల పురోగతి మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.
Read More : షోలాపూర్ ఎంఐడీసీ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.

One thought on “భారత్ – ఇరాన్ మధ్య కీలక చర్చలు”
Comments are closed.