ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్–పుతిన్ చర్చలు విఫలం

ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో దాదాపు గంటసేపు ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్, ఈ చర్చల్లో ఎలాంటి పురోగతీ నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, “పుతిన్ మారబోదు. ఆయనకు ప్రజలను చంపడం తప్ప మరొక దాని మీద ఆలోచన ఉండదు. ఇవి చింతాజనక పరిణామాలు. ఉక్రెయిన్ విషయంలో నేను పూర్తిగా నిరాశ చెందినట్టు చెప్పవచ్చు,” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ సూచించిన తక్షణ కాల్పుల విరమణ ప్రస్తావనను పుతిన్ తిరస్కరించినట్టు రష్యా అధ్యక్ష సహాయకుడు యూరీ ఉష్కోవ్ వెల్లడించారు. యుద్ధం ముగించాలన్న ఆలోచన లేదని, తమ లక్ష్యాలను సాధించే వరకూ ముందుకు సాగుతామని రష్యా స్పష్టం చేసింది.

అయితే దౌత్యపరమైన పరిష్కార మార్గాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ, ఆ మాటలకు విరుద్ధంగా ఫోన్ సంభాషణ ముగిసిన కొద్ది సేపటికే రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరో 13 ప్రధాన నగరాలపై భారీ రాకెట్ దాడులు జరిపాయి.

ఇది ట్రంప్–పుతిన్ మధ్య ఉక్రెయిన్ శాంతి కోసం జరిగిన ఆరవ చర్చ కావడం గమనార్హం. ఇప్పటివరకూ ఈ చర్చల్లో ఎలాంటి స్పష్టమైన ఫలితాలు రాలేదన్నది వాస్తవం.

Read More : దలైలామా భావోద్వేగం: ప్రజలకు సేవే నా ప్రధాన ఆకాంక్ష