భారత్‌పై ట్రంప్ వాణిజ్య ఒత్తిళ్లు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న విధానాలు అమెరికాలోనే తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ముఖ్యంగా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఆయన నిర్ణయాలను తప్పుబడుతూ, ఇవి అమెరికా ప్రయోజనాలకు, భారత్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన సంబంధాలకు హానికరమని ఆరోపించింది. డెమొక్రాట్లు పేర్కొన్నట్లు, భారత్ దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న భారీ టారిఫ్‌లు వాస్తవానికి అమెరికన్లకే నష్టాన్ని కలిగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య గత ఇరువై ఏళ్లుగా ఏర్పడిన వ్యాపార సంబంధాలు దెబ్బతింటున్నాయని వారు హెచ్చరించారు. చైనా రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటూనే ఉన్నా, ఆ దేశంపై ఎలాంటి చర్యలు లేకపోవడం గందరగోళ విధానమని వారు విమర్శించారు.

ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం విధించడం వల్ల మొత్తం టారిఫ్‌లు 50 శాతానికి చేరాయి. దీని ప్రభావంతో సుమారు 48 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమెరికాకు జరిగే ఎగుమతులు వాణిజ్యపరంగా లాభదాయకం కాకపోవడంతో పాటు, ఉద్యోగ నష్టాలు, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఈ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటి కీలక రంగాలకు అమెరికా మినహాయింపులు ఇవ్వడం కొంత ఊరటనిచ్చింది. ఇరుదేశాల వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నా, వ్యవసాయం, డెయిరీ రంగాల్లో అమెరికా డిమాండ్లు పెరగడంతో చర్చలు ఇంకా నిలిచిపోయిన పరిస్థితి కొనసాగుతోంది.

Read More : అమెరికా టారిఫ్‌ల పెంపు: భారత్ ఎగుమతులకు ముప్పు

One thought on “భారత్‌పై ట్రంప్ వాణిజ్య ఒత్తిళ్లు.

Comments are closed.