ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై రుద్రారపు సతీష్ ఆత్మహత్య సంచలనంగా మారింది. వాజేడు మండలం ఎస్సైగా పనిచేస్తున్న సతీష్ పూసూరు గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్ లో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఆదివారం ఉదయం ఒంటరిగా రిసార్ట్స్ కి వెళ్ళిన సతీష్ రాత్రి అయినా స్టేషన్ కి తిరిగి రాలేదు. దీంతో స్టేషన్ సిబ్బంది సోమవారం ఉదయం రిసార్ట్స్ కు వెళ్లి ఆరా తీశారు. సతీష్ అక్కడే ఉన్నాడని తెలిసిన వారు, అతను అద్దెకి తీసుకున్న గదికి వెళ్లి చూసారు. గదిలో రక్తపు మడుగులో పడిన సతీష్ ను చూసి వారు షాక్ అయ్యారు. ఈ విషయం వెంటనే అధికారులకు తెలియజేశారు. వాజేడు ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు మొదలైంది.
ఈ ఘటనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్ల సమాచారం కారణంగా మావోయిస్టులు ఇద్దరు గ్రామస్థులను గొడ్డలితో హత్య చేసిన ఘటన జరిగింది. ఈ కేసులో ఒత్తిడి తట్టుకోలేక సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు.
మరొకవైపు, ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సతీష్ కుటుంబ సభ్యులు అతనికి వేరే పెళ్లి సంబంధం చూడటంతో మనోవేదనకు గురై ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అనుమానం వ్యక్తమవుతోంది. అలాగే, ఆదివారం రాత్రి సతీష్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రిసార్ట్స్ కి వెళ్లినట్లు సమాచారం.
