భారత్–పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా భద్రతా మద్ధతును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం (మే 7) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని నాలుగు కీలక ప్రాంతాల్లో రక్షణ శాఖ మాక్ డ్రిల్ నిర్వహించనుంది.
ఈ డ్రిల్‌ను సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్‌బాగ్, మల్లాపూర్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. రక్షణ రంగంలోని ఉన్నతాధికారులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మాక్ డ్రిల్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్ మద్దతు ఉందని భారత్‌కు స్పష్టమైన ఆధారాలు లభించాయి. వాటిని అంతర్జాతీయ వేదికలపై భారత ప్రభుత్వం ప్రదర్శించగా, పాక్‌పై ప్రపంచ దేశాల నిరసన వ్యక్తమైంది.
దీని నేపథ్యంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే పాక్‌కు వ్యతిరేకంగా గగనతర ప్రవేశాన్ని నిలిపేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాన్ని ఒంటరిగా మిగిలించేందుకు భారత్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది.
ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరుస భద్రతా సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులతో పాటు రక్షణ శాఖ కార్యదర్శితో కూడా ఇటీవల భేటీ అయ్యారు. పాక్‌పై మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా భారత్ పావులు కదుపుతోందన్న అభిప్రాయం వెల్లివిరుస్తోంది.
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలన్న కేంద్ర ఆదేశాల మేరకు, ఢిల్లీ, ముంబయి, చెన్నై సహా మొత్తం 259 ప్రదేశాల్లో మెగా భద్రతా విన్యాసాలు జరుగనున్నాయి. ప్రజలు భయపడకుండా, సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read More : కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో భారీ అవినీతికి పాల్పడింది

One thought on “బుధవారం 4 ప్రాంతాల్లో మేజర్ భద్రతా విన్యాసం”
Comments are closed.