కోదాడ సమీపంలో అత్యవసర ల్యాండింగ్

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్ సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో అత్యవసరంగా ల్యాండింగ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో ఆందోళన నెలకొనగా, మంత్రి సహా హెలికాప్టర్‌లో ఉన్న వారు అందరూ సురక్షితంగా బయటపడటంతో తల్లడిల్లిన అధికారులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్ నుంచి కోదాడకు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే, గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అప్రమత్తమైన పైలట్, అత్యవసర ల్యాండింగ్ అవసరమని నిర్ధరించి, కోదాడ సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో హెలికాప్టర్‌ను సురక్షితంగా దించాడు.

విషయం తెలిసిన వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం కోదాడ పర్యటనను రద్దు చేసుకుని రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. హెలికాప్టర్‌లో ఈ విధమైన సాంకేతిక లోపం ఎలా తలెత్తిందన్న దానిపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Read More : కేసీఆర్‌కు నోటీసులపై కాంగ్రెస్-బీజేపీపై విమర్శలు.