హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు వేగం

హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల నాటికి కనీసం 50 శాతం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కేటాయించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం మరియు అంతర్జాతీయ బ్యాంకుల సహకారంతో నిధులు సేకరించేందుకు కసరత్తు చేస్తోంది.

ఈ దశలో మెట్రో పనులను పార్ట్-ఏ, పార్ట్-బీలుగా విభజించి, మొత్తం 8 కారిడార్ల కోసం రూ.43,848 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.21,047 కోట్లు (48 శాతం) అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలుగా పొందేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసింది.

ఇందులో భాగంగా, రెండు నెలల క్రితం జపాన్‌కు వెళ్లిన ప్రభుత్వ ప్రతినిధులు జైకా (JICA) అధికారులతో సమావేశమై నిధుల విషయమై చర్చించారు. ప్రాజెక్టు డీపీఆర్‌కు కేంద్రం అనుమతి ఇస్తే వెంటనే సహాయం అందించాలంటూ విజ్ఞప్తి చేశారు.

పార్ట్-ఏలో ప్రతిపాదించిన ఐదు కారిడార్లకు కేంద్రం అనుమతి తీసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. మరోవైపు, ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తంలో 4 శాతం నిధులు (రూ.1,753 కోట్లు) పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్ ద్వారా సేకరించాలని నిర్ణయించారు.

ఇందుకు తోడు, కేంద్రం, రాష్ట్రం వాటాను మినహాయించిన తర్వాత మిగిలిన రూ.22,800 కోట్లను అంతర్జాతీయ బ్యాంకులు, పీపీపీ భాగస్వాముల ద్వారా పొందేందుకు కృషి చేస్తున్నారు. ప్రాజెక్టు వేగవంతం చేయడంపై ప్రభుత్వం పటిష్ఠంగా అడుగులు వేస్తోంది.

read More : సచివాలయం ఎదుట రైతుల ఆందోళన