హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘హనీమూన్ హత్య’ కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ… తన భర్త రాజా రఘువంశీ హత్య కోసం కిరాయి హంతకులకు డబ్బు చెల్లించేందుకు జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తి యూపీఐ ఖాతాను వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కొత్త పేరు బయటకు రావడంతో కేసు మరింత చిక్కుముడిగా మారింది. దాంతో జితేంద్ర రఘువంశీ పాత్రపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

సోనమ్ మే 23న కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మొత్తాన్ని జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి పంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. హవాలా మార్గంలో ఈ లావాదేవీలు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు, సోనమ్ కుటుంబ వ్యాపార సంబంధాలను కూడా గమనిస్తూ హవాలా లింక్‌పై దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ వ్యవహారంపై సోనమ్ సోదరుడు గోవింద్ స్పందించారు. హవాలా ఆరోపణలను ఆయన ఖండిస్తూ, “జితేంద్ర మాకు బంధువు. మా వ్యాపారానికి గోదాములో లోడింగ్, అన్‌లోడింగ్ పనులు చూస్తాడు. ఆయన బ్యాంకు ఖాతాలోని డబ్బు కూడా మాదే. వ్యాపార అవసరాలకు ఆ ఖాతా నుంచి చెల్లింపులు చేస్తుంటాం. సోనమ్ వాడిన యూపీఐ ఖాతాను కూడా జితేంద్ర పేరుతోనే తెరిచాం” అని వివరణ ఇచ్చారు. అయితే, ప్రత్యేకంగా సోనమ్ కోసం జితేంద్ర పేరుతో ఖాతా ఎందుకు ప్రారంభించారనే ప్రశ్నను గోవింద్ గమనించకుండా వదిలేశారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కొత్త కోణంలో కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. కొత్త ఆధారాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని విచారణాధికారులు అంటున్నారు.

Read More : హనీమూన్ హత్య కేసులో సంచలన మలుపు

One thought on “హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు

Comments are closed.