హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం

హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-కులు జాతీయ రహదారి పూర్తిగా అస్తవ్యస్తమైంది. సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. దీంతో ఢిల్లీ మార్కెట్లకు వెళ్లాల్సిన కోట్ల రూపాయల విలువైన పండ్లు, కూరగాయలతో నిండిన వందలాది లారీలు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయాయి.

ట్రక్కుల్లోని యాపిల్స్, టమోటాలు కుళ్లిపోతున్నాయని డ్రైవర్లు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కులో రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు సరుకు ఉందని, మొత్తం మీద రూ.50 కోట్లకు పైగా విలువైన యాపిల్స్ నిలిచిపోయాయని అంచనా. ఐదు రోజులుగా కులులోనే చిక్కుకుపోయానని, తన సరుకుతో సాహిబాబాద్ మార్కెట్‌కు వెళ్లాల్సి ఉందని గఫార్ అనే ట్రక్ డ్రైవర్ తెలిపాడు. ఆజాద్‌పూర్, సాహిబాబాద్ మార్కెట్లకు వెళ్లాల్సిన వేలాది లారీల పరిస్థితి ఇలాగే ఉందని ఆయన వివరించాడు.

మండీ-కులు మధ్య దాదాపు అర డజను ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల హైవే పలు చోట్ల దెబ్బతిన్నదని, మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్ అశోక్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తుండగా, భారీ వాహనాలు మాత్రం రోజుల తరబడి నిలిచిపోయాయి.

ఈ పరిస్థితుల్లో మనాలి రాకపోకలు పూర్తిగా అడ్డంకికి గురయ్యాయని మనాలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రామన్ శర్మ పేర్కొన్నారు. కులులోని రామ్‌శిలా సమీపంలో ఇళ్లు దెబ్బతిన్నాయని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం తీవ్ర నష్టానికి గురవుతుందని జై భల్ అనే స్థానికుడు హెచ్చరించారు.

ఇప్పటివరకు నాలుగు దుకాణాలు, రెండు రెస్టారెంట్లు, ఒక ఇల్లు ధ్వంసమయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలు మండీ, కులు జిల్లాలను అత్యంత ప్రభావితం చేశాయి.

Read More : బీహార్‌లో రాహుల్ యాత్రలో స్టాలిన్ హాజరు – బీజేపీ ఘాటు విమర్శలు