బనకచర్లకు నీటి మళ్లింపుపై జీఆర్ఎంబీ అభ్యంతరం

పోలవరం ప్రాజెక్టు నుండి బనకచర్లకు నీటిని మళ్లించే ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రతిపాదనపై గోదావరి నదీ నిర్వహణ బోర్డు (జీఆర్ఎంబీ)తో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రకారం, పోలవరం ప్రాజెక్టు నుండి రోజుకు 2 టీఎంసీల నీటిని బనకచర్లకు తరలించాలన్న యోచన ఉంది. అయితే, ఈ మళ్లింపు ప్రాజెక్టు ప్రస్తుత ఆపరేషన్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని జీఆర్ఎంబీ హెచ్చరించింది. ఈ మార్పులకు మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలతో సంప్రదించి, అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇక అదనంగా 200 టీఎంసీల నీటిని మళ్లించాలన్న ప్రతిపాదన పోలవరం ప్రాజెక్టు కోసం ఆమోదించబడిన డీపీఆర్‌లో భాగం కాదని, ఇది కేవలం ప్రీ-ఫీజిబిలిటీ నివేదికలో మాత్రమే ఉందని పిపిఎ వివరించింది. ఈ నేపథ్యంలో 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) నిబంధనల ప్రకారం కొత్త డీపీఆర్‌ను ఏపీ ప్రభుత్వం సమర్పించాలంటూ సూచన చేసింది.

ఇటీవల జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో జీఆర్ఎంబీ, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అధికారికంగా ఎలాంటి పంపిణీ జరగలేదని పేర్కొంది. కొత్త నీటి పంపిణీపై స్పష్టత రావాలంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా రెండు రాష్ట్రాలు పరస్పర ఒప్పందానికి రావాలని సూచించింది.

Read More : లిక్కర్ స్కామ్: సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి