ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కారణంగా విద్యార్థులు వారి సర్టిఫికెట్లు పొందలేక, కొంతమంది కూలీ పనులకు కూడా వెళ్తున్నారని తెలిపారు.
విద్యార్థుల ఆత్మహత్యలకూ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే
పానుగంటి చైతన్య మాట్లాడుతూ, ‘‘అనంతపురంలో చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం హృదయవిదారకం. విద్యార్థుల పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఫీజులు చెల్లించలేక కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా మారింది’’ అని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ మౌనం.. ఎందుకు?
‘‘ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఈ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. చంద్రబాబు రూ. 3,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కాలేజీ యాజమాన్యాలు బకాయిలు చెల్లించలేదని విద్యార్థులను తరిమికొడుతున్నా, ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు’’ అని చైతన్య నిలదీశారు.
చంద్రబాబు విద్యా వ్యతిరేక విధానాలు
‘‘వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, చంద్రబాబు వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2,050 మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాసిన చరిత్ర చంద్రబాబుదే. ఇదంతా విద్యార్థుల భవిష్యత్తును తుంగలో తొక్కే చర్యలు. నిరుద్యోగ భృతి ఇప్పటివరకు ఇవ్వలేదు, గ్రూప్-2 అభ్యర్థులు రోడ్డెక్కినా మంత్రి లోకేష్ మాత్రం దుబాయ్ వెళ్లి క్రికెట్ చూస్తున్నారు’’ అని చైతన్య తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఉగ్ర పోరాటానికి సిద్ధం.. మార్చి 12న భారీ నిరసనలు
విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ఎదుట భారీ ధర్నాలు చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ప్రకటించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల పట్ల ప్రభుత్వ అనాసక్తిని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
