డెల్టా విమానానికి పెను ప్రమాదం తప్పింది

అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానానికి గాఢనిప్పు తప్పింది. బోయింగ్ 737-900 మోడల్‌కు చెందిన ఈ విమానం మంగళవారం రాత్రి అట్లాంటా నుంచి నార్త్ కరోలినాలోని రెలీ-డర్హం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. ఫ్లైట్ నెంబర్ 3247 అయిన ఈ విమానంలో 109 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ఎటువంటి సమస్యలు లేకుండా సాగినప్పటికీ, ల్యాండింగ్ సమయంలో ఊహించని పరిణామం సంభవించింది. విమానం ఎడమ రెక్క వెనుక భాగంలో ఉన్న కీలకమైన ఫ్లాప్‌కు సంబంధించిన ఓ భాగం ఊడి కిందపడింది. ఇది విమానాశ్రయం సమీపంలోని రోడ్డుపై పడ్డట్టు గుర్తించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ల్యాండింగ్ అనంతరం నిర్వహించిన తనిఖీలో రెక్క భాగం కనిపించకపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యల తర్వాత ఆ విడిభాగం విమానాశ్రయం సమీపంలోని రహదారిపై లభించింది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ధృవీకరించింది.

ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని FAA వెల్లడించగా, దర్యాప్తుకు తమ సంస్థ పూర్తి సహకారం అందించనున్నట్లు డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో వేగాన్ని, గమనాన్ని నియంత్రించే ‘ఫ్లాప్‌లు’ అత్యంత కీలకమైనవి కావడం గమనార్హం. ఇటీవలి కాలంలో బోయింగ్ విమానాల్లో భద్రతా లోపాలు పలు సందర్భాల్లో బయటపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

Read More : దలైలామా వారసత్వంపై భారత్ స్పష్టత

One thought on “డెల్టా విమానానికి పెను ప్రమాదం తప్పింది

Comments are closed.