తిరుమలాయపాలెం మండలంలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రజలే ప్రధాన బలం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి తగ్గనివ్వకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి పేదవానికి అండగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రూ.10 వేల భరోసా ఇస్తే, తమ ప్రభుత్వం రూ.12 వేల చొప్పున 9 రోజుల్లోనే 9 వేల కోట్లు రైతులకు అందజేసిందని ఆయన వివరించారు. పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో విఫలమైన గత ప్రభుత్వానికి భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 7 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేసిందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.
పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు అనేక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. గతంలో హాస్టళ్లను కోళ్ల ఫారాలు, రైస్ మిల్లుల్లో నడిపితే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతును రాజు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని, ధరణి రద్దు చేసి భూభారత్ చట్టం ద్వారా రైతులకు న్యాయం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
అలాగే యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని పొంగులేటి ఆరోపించారు. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని, ప్రతిపక్షాలు యూరియాను రాజకీయాలకు వాడుకుంటున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం పట్టించుకోలేదని గుర్తుచేశారు. త్వరలోనే రైతులకు యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
Read More : మియాపూర్‌లో విషాదం ?
