తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్న ఆయన, పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయం సాధించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, సోమవారం ఒక్క రోజులోనే మూడు జిల్లాలు పర్యటించి భారీ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ముందుగా నిజామాబాద్‌లో ఉదయం 11:30 గంటలకు జరిగే ప్రచార సభలో హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలలో, తర్వాత సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ చేరుకుని ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ సమయంలో, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితర నాయకులు ప్రచారానికి కదిలారు.
ఈ మూడు జిల్లాల్లో జరగనున్న సభలకు పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పటికే స్థానిక నేతలు ప్రచారంలో చురుకుగా వ్యవహరిస్తుండగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనడంతో ఎన్నికల హీట్ మరింత పెరిగింది.

One thought on “CM మూడు జిల్లాల్లో పర్యటన**”
Comments are closed.