కుంకీ ఏనుగులను స్వీకరించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో అడవి ఏనుగుల వల్ల పంట పొలాలు, జనావాసాలు తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏనుగుల దాడులతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, కర్ణాటక ప్రభుత్వం అందించిన ఆరు కుంకీ ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా స్వీకరించారు.

ఈ కార్యక్రమం కర్ణాటక రాజధాని బెంగళూరులోని విధానసౌధ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుంకీ ఏనుగులకు సంబంధించిన ధృవపత్రాలను పవన్ కల్యాణ్‌కు అప్పగించారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఈ ఏనుగులను అత్యంత ప్రేమతో, శ్రద్ధతో సంరక్షిస్తాము. వాటి భద్రత, సంరక్షణ బాధ్యతను నేను స్వయంగా పర్యవేక్షిస్తాను” అని హామీ ఇచ్చారు. గత రెండు దశాబ్దాలుగా ఏనుగుల దాడుల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేల ఎకరాల పంట నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంకీ ఏనుగులు ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించే దిశగా ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అటవీ పరిరక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణ వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాలు పరస్పరం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు. రాజకీయ భేదాలు పక్కన పెట్టి, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి స్వార్థం లేకుండా ఈ కీలకమైన సహాయం చేయడం అభినందనీయం అని వ్యాఖ్యానించిన పవన్, “వారు కేవలం కుంకీలను పంపలేదు, తమ మనసు వెదజల్లారు. ఆంధ్ర ప్రజల పట్ల వారు చూపిన మంచితనానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం” అని అన్నారు.

ఈ కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు భద్రత కలగనుండటం ఖాయం. ప్రజల ఆందోళనలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Read More : అమలాపురంలో ఉద్యోగాల పేరుతో మోసం

One thought on “కుంకీ ఏనుగులను స్వీకరించిన పవన్ కల్యాణ్

Comments are closed.