ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో జరిగిన హృదయ విదారక ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఏం జరిగింది?
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమె భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80,000 అప్పుగా తీసుకున్నారు. వడ్డీ సహా మొత్తాన్ని తీర్చలేకపోయిన నేపథ్యంలో భర్త తిమ్మరాయప్ప గ్రామం వదిలి వెళ్లిపోగా, శిరీష గ్రామంలోనే ఉంటూ కూలిపనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో మునికన్నప్ప తనకు రావాల్సిన డబ్బుల విషయమై శిరీష ఇంటికి వెళ్లి, ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బలవంతంగా బయటకు లాక్కొచ్చి, గ్రామస్తుల ఎదుట వేప చెట్టుకు తాడుతో కట్టేసాడు. “ఎప్పుడు డబ్బులు ఇస్తావు?” అంటూ ఆమెను దుర్భాషలాడుతూ వేధించాడు. ఈ దారుణాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబు ఆగ్రహం
ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. జిల్లా ఎస్పీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు మునికన్నప్పను ఇప్పటికే అరెస్టు చేసినట్లు ఎస్పీ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఏ మాత్రం అలసత్వం ఉండకూడదని సీఎం హెచ్చరించారు. బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉండాలని స్థానిక అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో పలువురు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More : చంద్రబాబు విరమించాలి: లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించండి
