సీఎం కు హరీశ్ రావు బహిరంగ లేఖ

తెలంగాణలోని మినీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని పూర్తిస్థాయి అంగన్వాడీ కార్యకర్తలుగా గుర్తించి పెంచిన వేతనాన్ని తక్షణం చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, తమ హయాంలో తీసుకున్న నిర్ణయాలను కేవలం ప్రచారానికి వాడుకుంటోందని ఆరోపించారు.

2023 సెప్టెంబరులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆ జీవో అమలుకు వీలుకాలేదని హరీశ్ రావు తెలిపారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 15న అదే జీవోను నకలు చేసి మరోసారి ప్రకటించడం బాధాకరమని విమర్శించారు.

జనవరి 2024 నుంచి మినీ అంగన్వాడీ మహిళలకు రూ.13,650 వేతనం చెల్లించి, ఆ తర్వాత తిరిగి రూ.7,800కి తగ్గించడాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఇది మానవతా విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కేవలం 8 జిల్లాల్లోనే పెరిగిన జీతాలు చెల్లించగా, మిగతా జిల్లాల్లో మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

అంగన్వాడీగా అప్‌గ్రేడ్ అయిన కేంద్రాల్లో హెల్పర్లను నియమించాలన్న డిమాండ్‌తో పాటు, మే నెల వేతనాలను అన్ని జిల్లాల్లో వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న మహిళల కడుపు కొట్టకండి… వారికి సరైన న్యాయం చేయండని హరీశ్ రావు ముఖ్యమంత్రికి స్పష్టమైన సందేశం పంపారు.

Read More : అగ్నిప్రమాదంపై తెలంగాణ హైల్‌వెల్ కమిటీ ఏర్పాటు