విజయవాడ: దుబాయ్ స్వర్గాన్ని తలపిస్తుందని చాలామంది అభిప్రాయం. తాజాగా దుబాయ్ గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్.. ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దుబాయ్ లో ఎడారి ప్రాంతాలు, బీచ్ లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరం. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. యూఏఈతో భారత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడి జనాభాలో 40శాతం మంది భారతీయులే. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ తో పరిస్థితి మారింది. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో భారత్ కు అపార అవకాశాలు వచ్చాయి. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించి రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచాం. రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నాం. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మెరుగైన సాంకేతికతతో అద్భుతాలు సృష్టించే కాలమిది. ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ స్థాపనే మా లక్ష్యం. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల వంటి అన్ని పనులు చేస్తున్నాం” అని తెలిపారు.
“కొత్తగా పీ4 విధానం తీసుకొస్తున్నాం.. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్షిప్, లులు మాల్ అంతర్జాతీయంగా రిటైల్ కేంద్రాలు నిర్వహిస్తోంది. దావోస్ లో నాలుగైదు సార్లు లులు మాల్ ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరాం. విజయవాడ, విశాఖలో లులు మాల్స్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఎగుమతులకు విశాఖ, కాకినాడకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. మొట్ట మొదటి హైడ్రోజన్ వ్యాలీ ఏపీనే. గ్రీన్ ఎనర్జీలో ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే గూగుల్ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఆరోగ్య రంగంలోనూ బిల్ గేట్స్ ఫౌండేషన్ తో పనిచేస్తున్నాం. సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తాం. ఈ ఏడాది 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షిస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం మార్చుకున్నాం. రాష్ట్రంలో మౌలిక వసతులకు ఎలాంటి కొరత లేదు. పోర్టులు, ఎయిర్పోర్టులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. నీటి వనరుల పరంగా, వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది” అని సీఎం వివరించారు. సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు హాజరై పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
Read More : ‘హరిహర వీరమల్లు’పై నారా లోకేశ్ ప్రత్యేక ట్వీట్

One thought on “యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం సంతోషకరం – CM”
Comments are closed.