ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన సుక్మా జిల్లాలోని ధర్మతాళ్లగూడెం వద్ద మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య బుధవారం ఉదయం తీవ్ర తుపాకీ యుద్ధం జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాల సమాచారం మేరకు, నక్సల్స్ సంచారంలో ఉన్నట్లు ముందుగా వచ్చిన నిఘా ఆధారంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో రెండు రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. మృతుల వద్ద నుండి ఆయుధాలు, విస్తారమైన మావో లిటరేచర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని మావోయిస్టులు దాగి ఉన్న అవకాశముందని భావిస్తూ భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో పరిసర గ్రామాల్లో కూడా జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

భద్రతా బలగాల అప్రమత్తత, సమర్థవంతమైన చర్యలతో మరోసారి మావోయిస్టుల కుట్రను భగ్నం చేసినట్లు అధికారం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి.

Read More : ప్రత్యేక పూజల పేరిట మోసం..