ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో కీలక పర్యటన నిర్వహించారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు.
విశాఖ ఆర్కే బీచ్ వేదికగా నిర్వహించనున్న యోగా కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బీచ్ రోడ్డుతో పాటు నగరంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఏర్పాట్ల వివరాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమానికి 607 సచివాలయాల సిబ్బంది పాల్గొంటున్నారని, వారి సమన్వయానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కార్యక్రమానికి ముందు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలని సూచించారు.
భద్రతా ఏర్పాట్ల గురించి కూడా సీఎం సమీక్షించారు. ముఖ్యంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఆర్కే బీచ్ అనంతరం ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను కూడా పరిశీలించిన సీఎం, అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.
Read More : తిరుమల శ్రీవారిని దర్శించిన రోజా, తిరుచానూరులో మీనా

2 thoughts on “విశాఖలో యోగాంధ్ర ఏర్పాట్లను సమీక్షించిన సీఎం”
Comments are closed.