సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రుల బృందం బిజీగా కొనసాగుతున్నారు. ఇవాళ నాలుగో రోజు పర్యటనలో భాగంగా సీఎం వరుస భేటీలు నిర్వహించారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), టెమసెక్ హోల్డింగ్స్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్‌షిప్స్‌పై చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే వర్క్ స్టేషన్ల ఏర్పాటు కోసం అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు. ఏపీని పెట్టుబడులకై ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని కెపిటాల్యాండ్ ప్రతినిధులు తెలిపారు.
మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్‌లేతో వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్ల ఏర్పాటుపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఈ రంగాల్లో పెట్టుబడులకు బార్క్‌లే సమ్మతి తెలిపారు.
జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఫైనాన్స్, ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్‌పై ఆసక్తి ఉందని రాజీవ్ కన్నన్ తెలిపారు.
అలాగే టెమసెక్ హోల్డింగ్స్ ప్రతినిధి దినేశ్ ఖన్నాతో గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీలో పెట్టుబడుల విస్తరణకు సిద్ధంగా ఉన్నామని, ఎంఓయూలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని దినేశ్ ఖన్నా హామీ ఇచ్చారు.
ఈ పర్యటన ద్వారా ఏపీలో పెట్టుబడుల విస్తరణకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
Read More : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు
