ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రసాదాన్ని వెంట తీసుకెళ్లడం ప్రత్యేకమైన సెంటిమెంట్‌గా మారింది. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా, ఢిల్లీ పెద్దలతో సమావేశాలైనా, ఏ పని మొదలు పెట్టినా వెంకన్న ఆశీస్సులుంటే విజయవంతమవుతుందని చంద్రబాబు గట్టి నమ్మకం.
ప్రస్తుతం ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతోంది. రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలోని ముళ్ల కంపలు, చెట్లు, చెదారాన్ని తొలగించే పనులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పనులు పూర్తయిన నేపథ్యంలో అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది.
ఇప్పట్లో అమరావతి అభివృద్ధి పనుల పునఃప్రారంభానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన సెంటిమెంట్‌ను పాటిస్తున్నారు. రేపు (శుక్రవారం) టీటీడీ ఆధ్వర్యంలో అమరావతిలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
అమరావతి రైతులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని టీటీడీ ఆహ్వానం అందజేసింది. శ్రీనివాస కల్యాణోత్సవం అనంతరం ఏప్రిల్ రెండో వారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మోదీ రాకతో రాజధాని అభివృద్ధి పనులను పునఃప్రారంభించనున్నారు.
సీఎం చంద్రబాబు గతంలో కూడా ఈ సెంటిమెంట్ పాటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి పాలన ప్రారంభించారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధిలోనూ అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు మరోసారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయాన్ని సాధించాలని సంకల్పించినట్లు స్పష్టమవుతోంది.

2 thoughts on “వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్.. చంద్రబాబు మరోసారి ఆచరణలో”
Comments are closed.