ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు కీలక కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తైన నేపథ్యంలో, అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మీడియాకు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్య అంశాలపై కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు వివరించారు.
గత ప్రభుత్వ పాలనపై విమర్శలు – పునర్నిర్మాణ దిశగా అడుగులు
2019 నుంచి 2024 వరకు వైకాపా హయాంలో రాష్ట్రం తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కనీసం పదేళ్లు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునర్నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బకాయిలు వదిలిందని ఆరోపించారు. అయితే ఇప్పటికీ ఏపీ అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా నిలిచిందని స్పష్టం చేశారు.
ఇంధన రంగంలో నూతన దిశగా చర్యలు
ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం పలు ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించినట్లు చంద్రబాబు తెలిపారు. ‘పీఎం సూర్యఘర్’ పథకం కింద రాష్ట్రంలోని 35 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకానికి కేంద్రం పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.
72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో ‘ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ’ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ విధానానికి సంబంధించిన రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు కేంద్రం మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే కుసుమ్ పథకం కింద 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం ఆమోదం ఇచ్చిందని, ఏపీ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
రక్షణ రంగంలో రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళిక
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం ఫలప్రదంగా జరిగిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న దృష్టితో పలు క్లస్టర్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించినట్లు వివరించారు.
జగ్గయ్యపేట–డోలకొండలో మిసైల్ తయారీ కేంద్రం, లేపాక్షి–మడకశిరలో మిలిటరీ, సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ యూనిట్లు, విశాఖ–అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్ ఎక్స్‌పర్‌మెంట్ కేంద్రాలు, కర్నూలు–ఓర్వకల్లు క్లస్టర్‌లో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్ తయారీ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే తిరుపతి ఐఐటీలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం సహకారం కోరాం
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,000 కోట్ల ఖర్చు అవుతుందని, ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించి సముద్రంలో కలిసే నీటిని వినియోగించవచ్చని చంద్రబాబు వివరించారు. ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా ప్రాజెక్టును రూపొందించామన్నారు. ప్రాజెక్టు పనులు తక్షణం ప్రారంభించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.
ఈ పర్యటన ద్వారా రాష్ట్ర అవసరాలపై కేంద్రానికి స్పష్టమైన అవగాహన కలిగించామని, కేంద్రం నుండి రానున్న మద్దతుతో ఏపీ అభివృద్ధికి వేగం చేకూరుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Read More : ఇద్దరు చిన్నారులు గాయాలతో ఆసుపత్రికి తరలింపు.
