కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

విజయవాడ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ఓ నివాస భవనంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన బెంజ్ సర్కిల్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం, నివాస భవనంలో విద్యుత్ లైన్‌లో టెక్నికల్ లోపం ఏర్పడటంతో ఇంట్లోకి కరెంట్ లీక్ అయ్యింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. వారు ఘటనా స్థలంలోనే మరణించారని అధికారులు తెలిపారు.

మృతుల్లో ఒకరు ముత్యాలమ్మగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఇద్దరి వివరాలు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషాద ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యుత్‌ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నిర్లక్ష్యం అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని పోలీసులు తెలిపారు

Read More : ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి